ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2025 (19:48 IST)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

marriage
ఓ వివాహ వేడుకలు ఆస్పత్రి అత్యవసర సేవల విభాగం (ఐసీయు) వేదికగా నిలిచింది. ఈ పెళ్లికి ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఆస్పత్రి సిబ్బందే అతిథులయ్యారు. ఈ అరుదైన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్రంలోని తంబోలికి చెందిన వీఎం శరణ్‌, అలప్పుళలోని కొమ్మాడికి చెందిన అవనికి శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయం వధువును అలంకరణ కోసం కుమారకోమ్‌కు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నవ వధువుకు గాయాలయ్యాయి. 
 
దీంతో స్థానికులు ఆమెను కొట్టాయంలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే, వెన్నెముక భాగంలో గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రత్యేక వైద్యం కోసం కోచ్చిన్‌లోని వీపీఎస్‌ లేక్‌షోర్‌ ఆస్పత్రికి తరలించారు.
 
ఈ సమాచారం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఆందోళనతో హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకొని.. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించాలని నిశ్చయానికి వచ్చి వైద్యులను సంప్రదించారు. ఇరు కుటుంబాలూ కోరడంతో వైద్యులూ సరే అన్నారు. ఎమర్జెన్సీ గదిలోనే తాళి కట్టేలా ఏర్పాట్లు చేశారు. 
 
బంధుమిత్రుల కోలాహలం మధ్య ఎంతో సందడిగా జరగాల్సిన ఈ వివాహం.. రోడ్డు ప్రమాదం కారణంగా కేవలం కొద్దిమంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఇరు కుటుంబాల సమక్షంలో ముహూర్తం సమయానికి జరిపించారు. వధువుకి వెన్నెముక భాగంలో గాయమైందని, త్వరలోనే శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.