Madhya Pradesh High Court పురుషులకు కూడా రుతుక్రమం వస్తే బాధ తెలుస్తుంది? సుప్రీం ఆగ్రహం
SC slams Madhya Pradesh HC for sacking women judges ఓ మహిళా న్యాయమూర్తిని విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళా న్యాయమూర్తికి గర్భస్రావం అయిన పరిస్థితిని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఆమెను మధ్యప్రదేశ్ హైకోర్టు విధుల నుంచి తొలగించింది. దీనిపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ, హైకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మహిళా జడ్జి అనుభవించిన మానసిక క్షోభను సదరు కోర్టు విస్మరించిందని పేర్కొంది. ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు ఆధారంగా తీర్పు ఇవ్వడాన్ని తప్పుపట్టింది.
గత 2023 జూన్ నెలలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో వారి పని తీరు లేదని పేర్కొంటూ ఈ తరహా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఇద్దరిని మాత్రం విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించింది.
ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. బుధవారం వాదనల సందర్భంగా హైకోర్టు తీర్పుపై విస్మయంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'సదరు మహిళా జడ్జికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అలాగే ఆమె సోదరుడు కేన్సర్‌తో మృతిచెందాడు. అయినా మధ్యప్రదేశ్ హైకోర్టు వినిపించుకోలేదు. పురుషులకూ నెలసరి వస్తే వారి బాధ తెలుస్తుంది' అని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్కే సింగ్‌లతో కూడిన బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.