మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (13:02 IST)

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం

liquor glass
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్‌లకు విమానంలో చేదు అనుభవం ఒకటి ఎదురైంది. వారిద్దరూ ఇటీవల కోయంబత్తూరులో జరిగిన సహచర జడ్జి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ తిరిగి కోవై నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరారు. అయితే, అదే విమానంలో ఇద్దరు మందుబాబులు కూడా ఉండడం ఆ న్యాయమూర్తులను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది.
 
వారు విమానం ఎక్కింది ఆదివారం రాత్రి కాగా, మరుసటి రోజు సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు చాలా కేసులు ఉన్నాయి. దాంతో, ఆ ఇద్దరు జడ్జిలు తమ ఐప్యాడ్లలో వివిధ కేసులకు సంబంధించి ప్రిపేర్ అవ్వాలని భావించారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీకి మూడు గంటల ప్రయాణం కాగా, ఈ సమయాన్ని కేసుల గురించి సన్నద్ధమయ్యేందుకు ఉపయోగించుకోవాలని వారు భావించారు. 
 
అయితే, ఆ విమానంలో ఇద్దరు మందుబాబులు మద్యంమత్తులో రచ్చ చేశారు. ఒక మందుబాబు టాయిలెట్లో దూరి తలుపేసుకున్నాడు. అరగంట నుంచి ఇతర ప్రయాణికులు తలుపు తెరవాలని చెబుతున్నా అతడు లోపలే ఉండిపోయాడు. మరో మందుబాబు టాయిలెట్ బయట వాంతి చేసుకోవడం ప్రారంభించాడు. జడ్జిలతో సహా, ఆ దృశ్యాలు చూసిన వాళ్లకు వాంతి వచ్చినంత పనైంది.
 
చివరికి ఎలాగోలా టాయిలెట్ తలుపు తెరిస్తే... మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. విమాన సిబ్బంది ఆ మందుబాబును టాయిలెట్ నుంచి బయటికి తీసుకువచ్చారు. ఇదంతా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్‌ల కళ్ల ఎదుటే జరిగింది. ఈ విషయాన్ని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్వయంగా సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ వెల్లడించారు.
 
ఈ కేసు కూడా విమానంలో ఓ మందబాబు వికృత చర్యకు సంబంధించినదే. గతంలో, న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు వృద్ధురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన పట్ల ఆ వృద్ధురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండేళ్ల కిందట దాఖలైన ఈ పిటిషన్ పై తాజాగా విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్ విమానంలో తమకు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా షేర్ చేశారు.