ఢిల్లీలో వాయు కాలుష్యం-మళ్లీ మూతపడనున్న పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వేధిస్తుంది. ఇప్పటికే కరోనా ఒకవైపు... వాయు కాలుష్యం మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో వాయు కాలుష్య సంక్షోభం కారణంగా ఢిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. దీంతో సోమవారమే ప్రారంభమైన పాఠశాలలు మళ్లీ మూతపడనున్నాయి.
ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడంపై సుప్రీం ఢిల్లీ సర్కారుపై ఫైర్ అయ్యింది.
మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు.. ఇదేంటి అంటూ సుప్రీం కోర్టు మందలించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా సుప్రీంకు వివరణ ఇచ్చింది.
గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని పాఠశాలలు తెరిచామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. దీంతో పాఠశాలలు మూతపడనున్నాయి.