వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో
ఆదివారం నాడు ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లే స్పైస్ జెట్ విమానం జమ్మూ కాశ్మీర్‌లోని ప్రమాదకరమైన బనిహాల్ పాస్ మీదుగా గాల్లోనే అనేక వందల మీటర్లు పడిపోయిందని ఒక ప్రయాణీకుడు పేర్కొన్నాడు. ఆ ప్రయాణీకుడు తన వాదనలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పంచుకున్నాడు. ఆ వీడియోలో ప్రయాణీకులు విమాన సీట్లు పట్టుకుని ఉన్నట్లు చూడవచ్చు, విమాన సహాయకుల్లో ఒకరు విమానం లోపల మోకాళ్లపై నడుస్తూ దోగాడుతున్నట్లు కనబడుతోంది.
ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానం SG-385 గాల్లోనే అల్లకల్లోలానికి గురైందనీ, బనిహాల్ పాస్ మీదుగా విమానం వెళుతున్నప్పుడు అనేక వందల మీటర్లు పడిపోయిందని ప్రయాణీకుడు ఆరోపించాడు. అయితే ఆ ప్రయాణీకుడి వాదనను స్పైస్ జెట్ అధికారులు కొట్టిపారేసారు. స్పైస్ జెట్ విమానం వాతావరణ పరిస్థితుల కారణంగా స్వల్పంగా అల్లకల్లోలానికి గురైనప్పటికీ, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని స్పైస్‌జెట్ పేర్కొంది. విమానం శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందనీ, సీట్‌బెల్ట్ గుర్తు ఆన్‌లో ఉన్నప్పుడు, వినానం కిందికి దిగుతున్నప్పుడు అల్లకల్లోలం ఏర్పడిందంటూ చెప్పుకొచ్చింది.