శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (12:16 IST)

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఇకలేరు...

Bindeshwar Pathak
Bindeshwar Pathak
ప్రముఖ సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ఇకలేరు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. సులభ్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ వద్ద మంగళవారం ఉదయం జాతీయ జెండాను. ఆవిష్కరించిన అనంతరం ఆయన కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. 
 
బిందేశ్వర్ పాఠక్ ఆధ్వర్యంలో సులభ్ ఇంటర్నేషనల్ 13 లక్షల వ్యక్తిగత టాయిలెట్లను, తక్కువ ఖర్చు అయ్యే టు-పిట్ టెక్నాలజీతో 5.4 కోట్ల ప్రభుత్వ టాయిలెట్లను నిర్మించింది. టాయిలెట్ల నిర్మాణంతోపాటు ఈ సంస్థ మనుషులు మానవ వ్యర్థాలను తొలగించడాన్ని నివారించేందుకు ఉద్యమం నడిపింది.
 
బహిరంగ మల విసర్జన, అపరిశుభ్ర టాయిలెట్ల నివారణే. లక్ష్యంగా పాఠక్ 1970లో సులభ ఇంటర్నేషనల్‌ను స్థాపించారు. ఈ సంస్థ కృషి కారణంగా దేశ వ్యాప్తంగా తక్కువ ఖర్చు అయ్యే సులభ టాయిలెట్లు వాడుకలోకి వచ్చాయి. దీంతో లక్షలాది మంది సామాన్యులు బహిరంగ మల విసర్జన చేసే పరిస్థితి దూరమైంది. దేశంలో సులభ అనేది పబ్లిక్ టాయిలెట్లకు పర్యాయపదంగా మారింది. 
 
మరోవైపు, బిందేశ్వర్ పాఠక్ మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 'సమాజ ప్రగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బిందేశ్వర్ పాఠక్ ఎంతో కృషి చేశారు. పరిశుభ్ర భారత్ కోసం పరితపించారు. స్వచ్ఛభారత్ మిషన్ పూర్తి సహకారం అందించారు. ఆయన సేవలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయి.. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపంట అని మోడీ ట్వీట్ చేశారు.