మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (19:08 IST)

అలాంటి ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి : సుప్రీంకోర్టు

supreme court
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు వివిధ నేరాల్లో శిక్షను అనుభవిస్తున్న దోషులు, విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, వారందరూ 15 రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. మహమ్మారి సమయంలో అత్యవసర, మధ్యంతర బెయిళ్లపై విడుదలైనవారు ఈ మేరకు లొంగిపోవాలని జస్టిస్‌ ఎంఆర్ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
లొంగిపోయిన అనంతరం విచారణ ఖైదీలు.. రెగ్యులర్‌ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా దోషులు సైతం లొంగిపోయిన తర్వాత.. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ, చట్టాలకు లోబడి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. 
 
మరోవైపు, కరోనా తీవ్రత దృష్ట్యా సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు.. వివిధ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రత కలిగిన నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్థులు, విచారణ ఖైదీలను విడుదల చేశారు. తాజాగా వారందరూ లొంగిపోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.