శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2024 (17:19 IST)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

divorce
విడాకుల సమయంలో భర్తను రోడ్డుమీదికి ఈడ్చేలా భరణం మొత్తాన్ని డిమాండ్ చేయరాదని మహిళలకు సుప్రీంకోర్టు సూచన చేసింది. అలాగే, అత్తింటి వారి వేధింపుల నుంచి రక్షణ కోసం, మీ సంక్షేమం కోసం చేసిన కఠిన చట్టాలను ఆయుధాలుగా మార్చుకోవద్దని హితవు పలికింది. 
 
ఆ చట్టాలు మీ రక్షణ కోసమే కానీ భర్తలపై ఆయుధాలుగా ప్రయోగించేందుకు కాదన్నారు. వివాహం అనేది కమర్షియల్ వెంచర్ కాదని వ్యాఖ్యానించింది. విడాకుల సమయంలో కోరే భరణం రీజనబుల్‌గా ఉండాలే తప్ప విడిపోయిన భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా కాదని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఓ విడాకుల కేసులో తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
వివాహం తర్వాత భర్తపై ఆధారపడిన భార్య.. విడాకుల తర్వాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే భరణం అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మాజీ భాగస్వామి ఆర్థిక స్థాయికి సరిసమానంగా ఉండేలా భరణం నిర్ణయించలేమని స్పష్టం చేసింది. సామజిక పరిస్థితులు, జీవనశైలి ఆధారంగా భరణాన్ని న్యాయ సమ్మతంగా నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
భార్య వేధింపులు, భరణంగా భారీ మొత్తం డిమాండ్ చేయడం, తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోగా, తన ఆత్మహత్యకు ముందు అతుల్ సుభాష్ రాసిన ఆత్మహత్య లేఖ, సెల్ఫీ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మహిళల కోసం చేసిన చట్టాలతో మగవాళ్లను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.