బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:58 IST)

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

గతంలో తెలుగు భాషపై దాడి జరిగిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలిపారు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. కడప పట్టణంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగిన డాక్టర్ జానమద్ది హనుమంత్ శాస్త్రి శతజయంతి వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
తెలుగు భాష సంగీతమయినటువంటిదన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారే కానీ భాష గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారని అన్నారు.
 
విదేశీయుడైన బ్రౌన్ తెలుగు భాష గురించి చేసిన కృషి అభినందనీయమన్నారు. కడపలో ఇలాంటి లైబ్రరీ ఏర్పాటు చేసిన శాస్త్రి కృషి ప్రశంసనీయమన్నారు. విదేశీ ఉద్యోగాల కోసం తెలుగు భాషను మరచిపోతున్నారన్నారు. మాతృభాషను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఏ భాషపై అయినా పట్టు సాధించవచ్చన్నారు. ఇతర దేశాల్లో వారు మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాలలో వారు తమ భాషలో తప్ప ఇతర భాషలో సమాధానం చెప్పరన్నారు. 
 
తాను వీధి బడిలో చదువుకొని ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. గొప్ప వారు కావాలంటే ఇంగ్లీషు ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. దేశంలో గొప్ప వారు తెలుగు బడిలో చదువుకునే పైకి వచ్చినవారేనని గుర్తు చేశారు. పక్క రాష్ట్రాలలో వారు తమ భాష కోసం ఎంత కృషి చేస్తున్నారో వారిని చూసి నేర్చుకోవాలన్నారు. మన తెలుగు భాషను మనమే పరిరక్షించుకోవాలన్నారు. రాష్ట్రంలో తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేయాలని సూచించారు. మన దేశంలో ఉన్న తెలుగు ప్రజల కన్నా విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తున్నారని తెలిపారు.