శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (14:01 IST)

పెగాసస్‌ ఫోన్ల హ్యాకింగ్‌పై విచారణ కమిటీకి సుప్రీంకోర్టు ఓకే

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గురువారం వెల్లడించారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. 
 
ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌ సింగ్‌తో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ విషయాన్ని తెలిపారు. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్‌ కూడా ఒకరు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు భావించింది. 
 
అయితే సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్‌ జస్టిస్‌ వెల్లడించారు. అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.