శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:29 IST)

శశికళకు ఎడప్పాటి చుక్కలు, 800 ఎకరాలతో పాటు వందల కోట్ల ఆస్తి జప్తు

రాజకీయాలంటే అంతే. నిన్న మిత్రుడు కాస్తా రేపు శత్రువై కూర్చుంటాడు. కుర్చీ పవర్ అంటే అదేమరి. ఆ కుర్చీ కోసం రాజకీయ సమీకరణాలు ఎలాబడితే అలా మారిపోయిన సంఘటనలు చరిత్రలో ఎన్నో చూశాం. రకరకాల రాజకీయాలు దేశంలోనూ రాష్ట్రాల్లోనూ చూస్తూనే వున్నాం. కొన్ని అసెంబ్లీల్లో అయితే ప్రజాప్రతినిధులు కోట్లాటలాడిన సందర్భాలు అనేకం.
 
ఇక అసలు విషయానికి వస్తే... అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి చెన్నై నగరానికి వచ్చిన శశికళ, ఎడప్పాటి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వచ్చీ రాగానే పార్టీ నాదే... జెండా కూడా నాదేనంటూ పల్లవి అందుకున్నారు. దీనితో సీఎం ఎడప్పాటి ఇక లాభం లేదనుకుని చర్యలకు ఉపక్రమించారు.
 
తొలుత వాహనంపై అధికార పార్టీకి చెందిన జెండా ఎలా వచ్చిందని ఆరా తీయగా, తమ పార్టీకే చెందిన కొందరు నాయకులు శశికళకు సాయం చేసినట్లు తేలింది. వారి వాహనాలను శశికళకు ఇవ్వడంతో ఆమె పార్టీ జెండా వున్న కార్లతో నగరంలోకి ఊరేగింపుగా వచ్చారు. దీనితో సాయం చేసిన నాయకులపై ఎడప్పాటి కొరడా ఝుళిపించారు. వెంటనే వారిపై చర్యలకు ఆదేశించారు.
 
ప్రస్తుతం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎడప్పాటి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తోంది. 2017లో శశికళ అక్రమాస్తులను జప్తు చేయాలని సుప్రీం ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు శశికళకు చెందినవిగా భావిస్తున్న 800 ఎకరాలతో పాటు వందల కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నది. దీనితో శశికళకు షాక్ కొట్టినట్లయింది. కాగా దీనిపై టిటివి దినకరన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.