శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:05 IST)

తిరువళ్లూరు ఆశ్రమంలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలోని ఓ ఆశ్రమంలో 20 యేళ్ల కాలేజీ విద్యార్థిని ఒకరు విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆశ్రమ పూజారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
తిరువళ్లూరు జిల్లాలో పూడికి సమీపంలోని వెల్లత్తుక్కోట గ్రామంలో మునుస్వామి అనే వ్యక్తి గత కొన్నేళ్ళుగా ఆశ్రమం నడుపుతున్నాడు. ఇక్కడకు ప్రతి రోజూ ఆనేక మంది సంతాన భాగ్యంలేని మహిళలు, పెళ్లికాని యువతులు ఇక్కడకు వచ్చిన వివిధ రకాల పూజలు చేయించుకుని వెళ్లేవారు. 
 
అయితే, చెంబేడు గ్రామానికి చెందిన రామకృష్ణన్ అనే వ్యక్తి కుమార్తె హేమమాలిని (20). బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ యువతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆశ్రమానికి తీసుకెళ్లగా, విద్యార్థిని పరిశీలించిన మునుస్వామి.. హేమమాలినికి నాగదోషం పట్టిందని చెప్పారు. 
 
పైగా, ఈ యువతికి ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు ప్రత్యేక పూజలు చేస్తే బాగువతుందని మునుస్వామి నమ్మించాడు. అప్పటినుంచి గత యేడాదిగా ఆ యువతి ఆశ్రమంలోనే ఉంటూ, చికిత్స తీసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం పౌర్ణమి కావడంతో మంగళవారం అర్థరాత్రి వరకు ఆ యువతి ఆశ్రమంలో అనేక పనులు, పూజలు చేసింది. 
 
ఇంతలో ఏమైందో ఏమోగానీ, ఆ యువతి పురుగుల మందు సేవించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆ యువతిని తిరువళ్లూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమ పూజారి మునుస్వామిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన్ను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు.