తమిళనాడు సీఎం స్టాలిన్‌తో నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా సోమవారం సమావేశమ్యారు. చెన్నైలోని సచివాలయంలో తన భర్త ఆర్కే. సెల్వమణితో కలిసి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ బొమ్మతో తయారు చేసిన శాలువాను బహుకరించారు. ఆ తర్వాత పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు.
ముఖ్యంగా, నగరితో పాటు చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు తమిళ పాఠపుస్తకాలు అందజేయాలని కోరారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతి వరకు వెయ్యి పుస్తకాలు చొప్పున మంజూరు చేయాలని కోరారు.
అలాగే ఏపీ ఇండస్ట్రియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5800 ఎరకాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామికవాడకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి భారీ వాహనాల రాకపోకలకు అనువుగా నేడుంబరం - అరక్కోణం రోడ్డు ఎన్.హెచ్.716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
అలాగే, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వినతి పత్రం సమర్పించారు.