వెలుగులోకి జయ మృతి మర్మం?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో దాగిన మర్మం విచారణ కమిషన్ నివేదికలో వెల్లడవుతుందని మాజీ మంత్రి పొన్నయన్ వ్యాఖ్యానించారు. చెంగల్పట్టు జిల్లాలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన జయలలిత మూడవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
జయలలిత మృతిపై మర్మం ఉందన్నారు. ఆమెకు ప్రారంభం నుంచి స్టెరాయిడ్స్ అందిస్తున్నారని, ఈ మందు వాడితే అనేక వ్యాధులు సంక్రమించి ప్రాణాలు కోల్పోయే అవకాశముందన్నారు. ఏదిఏమైనా అమ్మ మరణంలో మర్మం ఉందని, అది విచారణ కమిషన్ అందించే నివేదికతో వెలుగు చూస్తుందన్నారు.
నాంగునేరి, విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలే స్థానిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం చేపట్టిన పథకాలను పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తమిళులు సైతం అభినందిస్తున్నారని పొన్నయన్ తెలిపారు.