1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:11 IST)

దేశంలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 6,70,847 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,729 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా 12 వేలకు పైనే కేసులు వెలుగుచూశాయి. నిన్న 221 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
గత ఏడాది ప్రారంభంలో దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి 3.43 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. నిన్న 12,165 మంది కోలుకున్నారు.
 
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 1,48,922 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.43 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.23 శాతంగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకూ 4,59,873 మరణాలు సంభవించాయి.
 
నిన్న దీపావళి సెలవు కావడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్యతో పాటు టీకా పంపిణీ కూడా మందగించింది. నిన్న 5,65,276 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. మొత్తంగా 107.7 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.