కరోనా రోగి వున్న ఆంబులెన్స్‌లోకి ముగ్గురు యువకులు.. చివరికి ఏమైందంటే?
కరోనా వైరస్ వ్యాపించడంతో ప్రజలంతా లాక్ డౌన్‌లో వున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా.. ఆ ఆంక్షలను కొందరు పాటించట్లేదు. ఇందులో ముఖ్యంగా యువత లాక్ డౌన్‌ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
మాస్కులు ధరించకుండానే రోడ్లపైకి రావడం చేస్తున్నారు. అంతేగాకుండా ముగ్గురు ఒకే బైకుపై తిరగడం వంటివి చేస్తున్నారు. అలాంటి వారికి తమిళనాడు, తిరుప్పూరు పోలీసులు చుక్కలు చూపించారు. కరోనా అంటే ఎలా వుంటుందో చుక్కలు కనిపించేలా సినిమా చూపించేశారు.
వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్‌తో యువకులు పనీపాటా లేకుండా వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కఠినంగానే శిక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు పోలీసులు లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఆకతాయిలకు కరోనా సినిమా చూపించారు.
బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి.. కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్‌లోకి ఎక్కించి బుద్ధి చెప్పారు. రోడ్ల మీదకు వచ్చిన వారిని కరోనా రోగి ఉన్న అంబులెన్స్, లేదా గదిలో బంధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా కరోనా రోగి వున్నట్లు ఆంబులెన్స్‌లో ఓ వ్యక్తిని వుంచి.. లాక్ డౌన్‌ను అధిగమించిన ఆ ముగ్గురు యువకులను ఆ ఆంబులెన్స్‌లోని పంపారు.
ఆ ముగ్గురు యువకులు నిజమైన కరోనా రోగిగా అతని నుంచి తప్పించుకునేందుకు మల్లగుల్లాలు పడ్డారు. కిటికీల నుంచి దూకారు. అయినా ఆ యువకులను వారు ఏమాత్రం వదిలిపెట్టక ఆంబులెన్స్‌లోకి ఎత్తిపడేశారు వాలంటీర్లు. తర్వాత బుద్ధి తెలుసుకున్న యువకులు.. మాస్క్ ధరించి బతుకు జీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.