శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:02 IST)

పారిశ్రామికోత్పత్తి పాతాళానికి: నీతి ఆయోగ్ సీఈఓ

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా, పారిశ్రామిక ప్రగతి పాతాళానికి పడిపోయిందని, సప్లయ్ చైన్ పై తీవ్రమైన ప్రభావం పడిందని, పని విధానం కూడా మారిపోయిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వరల్డ్ బ్యాంక్ భారత డైరెక్టర్ జునైద్ అహ్మద్, హీరో ఎంటర్ ప్రైజస్ చైర్మన్ సునీల్ ముంజాల్, నాస్కామ్ అధ్యక్షుడు దేబ్ జానీ ఘోష్, టీమ్ లీజ్ చైర్మన్ మనీశ్ సభర్వాల్, అర్బన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అభిరాజ్ భల్ తదితరులతో  'కొవిడ్-19 అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్' అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ను ఆయన నిర్వహించారు.

"ఈ మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు వ్యవస్థ ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. కొత్త తరహా ఉద్యోగాల కోసం మన ప్రజలకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా సరికొత్త ప్రపంచంవైపు అడుగులు వేస్తున్నాం. మన ఐఐటీలు, ఇంజనీరింగ్ మరియు విద్యా సంస్థల అన్ని రకాల కరిక్యులమ్స్ ఇప్పుడు అవుట్ డేట్ అయిపోయాయి. కొత్త తరం కోర్సుల అవసరం పెరిగింది" అని అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు.
 
"దాదాపు పదేళ్ల క్రితం ప్రపంచ విధానాన్నివాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయని అంచనా వేశాం. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఇండియా వంటి దేశాలపై ఉంటుందని భావించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై దృష్టిని సారించాలని సూచించాం.

ఈ దిశగా ఇండియా ఎన్నో అడుగులు వేసింది. ఇప్పుడు వాతావరణ మార్పుల స్థానంలో కరోనా వైరస్ వచ్చి చేరింది. ప్రపంచం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవాన్ని గుర్తించాల్సిందే. సాంఘిక భద్రతా వ్యవస్థను కొత్త కోణంలో చూడాల్సిన సమయమిది" అని కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వరల్డ్ బ్యాండ్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
 
కరోనా వైరస్ కారణంగా వాణిజ్య విధానం మారిపోయిందని, సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాల్సి వుందని నాస్కామ్ అధ్యక్షుడు దేబ్ జానీ ఘోష్ వ్యాఖ్యానించారు. కరోనా అందించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్ దిశగా కదలాలని టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథ్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సరైన అడుగులు వేయకుంటే, అది నష్టమేనని హెచ్చరించారు.

"మనం స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని చూసేందుకు కనీసం మూడేళ్లు పడుతుందని నేను అంచనా వేస్తున్నాను. సినిమా హాల్స్ పరిస్థితి కూడా అంతే. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే, రిమోట్ వర్క్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ వినియోగం పెరుగుతుంది.

ఎన్నో మార్పులను చూడబోతున్నాం. ప్రజారోగ్యంపై ప్రభుత్వాల దృష్టి కోణం కూడా మారుతుంది. ఆఫీసు కార్యాలయాల్లోనే కూర్చుని పని చేయాల్సిన విధానం ఇకపై తగ్గిపోతుంది. ఈ సమయంలో సరైన ఆలోచనా ధోరణి తో ముందడుగు వేయాలి" అని సునీల్ ముంజాల్ సూచించారు.