ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది.. జగదీశ్ శెట్టర్

jagadish-shettar
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కమలనాథులు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ ఒకరు. 40 యేళ్లుగా బీజేపీతో అనుబంధం కలిగిన జగదీశ్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హుబ్లీ - ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన శిష్యుడి మహేశ్ టెంగినకాయ్ చేతిలో 34 వేల ఓట్ల తేడాదో ఓటమిపాలయ్యారు. 
 
ఈ ఓటమిపై ఆయన స్పందించారు. తనను ఓడించేందుకు బీజేపీ డబ్బులు పంచిందని తాజాగా ఆరోపించారు. తాను ఓడినా.. తన పంతం నెగ్గిందని, ఇపుడు తనకు చాలా తృప్తిగా ఉందని చెప్పారు. తనకు టిక్కెట్ నిరాకరించినందుకుబీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అపుడే చెప్పానని, ఆ ప్రభావం 20 నుంచి 25 స్థానాల్లో ఉంటుందని ఆయన చెప్పారు. 
 
ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాదించారు. లింగాయత్‌లు తన వెంటే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు. తనను ఓడించినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఓడిందన్నారు. వాళ్ళ లక్ష్యం తనను ఓడించడమేనా? ఇదేనా వాళ్ల అంతిమ లక్ష్యం అని బీజేపీపై దుమ్మెత్తి పోశారు.