గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (14:22 IST)

రామ లీలా నాటకంలో వానర వేషం.. సీత కోసం గాలిస్తూ జైలు నుంచి ఖైదీలు ఎస్కేప్...

jaipur jail
విజయదశమి పండుగను పురస్కరించుకుని జైలులో రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో ఇద్దరు ఖైదీలు వానరులుగా నటించారు. వీరిద్దరూ సీత కోసం గాలిస్తున్నట్టుగా నాటకమాడి జైలు నుంచి గుట్టుచప్పుడు కాకుండా అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ పట్టణంలోని రోష్నాబాద్ జైలులో జరిగింది. ఈ నాటకంలో వానరాలుగా వేషం చేసిన పంకజ్, రాజ్‌ కుమార్ అనే ఇద్దరు ఖైదీలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్ పట్టణంలోని రోష్నాబాద్ జైలు రామ్ లీలా నాటకాని ప్రదర్శించారు. ఈ నాటకం రసవత్తరంగా సాగుతుండడం, జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా నాటకం చూడడంలో మునిగిపోవడంతో ఇదే అదునుగా భావించిన వానర వేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని నిచ్చెన ద్వారా గోడ దూకి పరారయ్యారు. 
 
ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి శుక్రవారం వారు జైలు నుంచి తప్పించుకున్నారు. దాంతో జైలులో ఎంతగానో వెతికినా ఇద్దరు ఖైదీలు కనిపించకపోవడంతో జైలు అధికారులు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన పంకజ్‌కు హత్య కేసులో జీవిత ఖైదు విధించబడింది. 
 
అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాకు చెందిన రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇద్దరు ఖైదీలు జైలులో నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికుల కోసం గోడపైకి ఎక్కేందుకు అక్కడ ఉంచిన నిచ్చెనను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా రామలీలాను వీక్షిస్తున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు జైలు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. పారిపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.