గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (13:12 IST)

ఫైనాన్షియల్ సర్వీసులను ప్రారంభించిన రిలయన్స్ జియో

jio financial app
తమ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో మరో సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో ఈ కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ బీటా వెర్షన్‌ను మే 30వ తేదీన ప్రారంభించింది. ఆ తర్వాత అనేక మంది నుంచి ఫీడ్‌బ్యాక్‌లు తీసుకుంది. వీటి ఆధారంగా ఈ సేవలను మరింతగా పునరుద్ధరించి జియో ఫైన్సాన్స్ యాప్‌ను తీసుకొచ్చింది. 
 
ఈ యాప్‌ను ఇక నుంచి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, మైజియోలలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మ్యూచువల్ ఫండ్‌పై రుణాలు, హోమ్ లోన్స్, ఆస్తులపై లోన్లతో పాటు పలు రకాల ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సేవలను పొందవచ్చని కంపెన తెలిపింది.
 
కస్టమర్లు సేవింగ్స్‌తో పాటు రుణాలను కూడా పొందవచ్చునని రిలయన్స్ ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. సురక్షితమైన బ్యాంకింగ్ సేవల కోసం బయోమెట్రిక్ ప్రమాణాలతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు వివరించింది. డెబిట్ కార్డులను ఉపయోగించి జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (జేపీబీఎల్) కేవలం 5 నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను తెరవవచ్చని వివరించింది.
 
ఈ యాప్‌పై అదనంగా యూపీఐ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా చెల్లించవచ్చునని కస్టమర్లకు తెలిపింది. కస్టమర్లు వేర్వేరు బ్యాంకులకు సంబంధించిన తమ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లను సైతం తనిఖీ చేసుకోవచ్చునని వివరించింది. ఈ యాప్‌ల లైఫ్, హెల్త్, టూ వీలర్, మోటర్ ఇన్సూరెన్స్‌తో పాటు మొత్తం 24 బీమా ప్లాన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ సేవలన్నీ డిజిటల్‌గానే అందుబాటులో ఉంటాయని వివరించింది.