హైదరాబాద్ టీ20లో బంగ్లాదేశ్ చిత్తు.. భారత్ ఘన విజయం
హైదరాదాద్ నగరంలో శనివారం రాత్రి పర్యాటక బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ళు దుమ్ములేపారు. భారత జట్టు ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించింది.
ఆ తర్వాత భారీ విజయ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ విజయంతో భారత్ ఒక ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
టీ20 ఫార్మాట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బద్దలు కొట్టింది.
బంగ్లాపై అత్యధిక పరుగుల తేడాతో విజయాలు... భారత్ -133 పరుగులు (2024), దక్షిణాఫ్రికా 104 పరుగులు (2022), పాకిస్థాన్ - 102 పరుగులు (2008), భారత్ - 86 పరుగులు (2024), దక్షిణాఫ్రికా- 83 పరుగుల(2017)తో భారత్ గెలుపొందింది.
కాగా, హైదరాబాద్ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత బ్యాటర్లు చెలరేగారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ - సంజూ శాంసన్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత చివరిలో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.