సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (09:27 IST)

ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తివేత : అన్‌లాక్ 4.O రూల్స్ రిలీజ్

కరోనా మహమ్మారి కారణంగా విధించిన అనేక రకాలైన లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. ముఖ్యంగా, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించింది. దీంతో ప్రయాణికులు ఇకపై దేశంలోని ఏ రాష్ట్రానికైనా స్వేచ్ఛగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం వారికి ఈ-పాస్ అక్కర్లేదు. 
 
ఈ నెలాఖరుతో అన్‌లాక్ 3.O ముగియనుంది. దీంతో అన్‌లాక్ 4.0 మరో రెండు రోజుల్లో ప్రారంభంకాబోతున్న వేళ కేంద్రం తదుపరి దశ సడలింపులపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగో దశ అన్‌లాక్‌లో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ప్రజా రవాణాపైనే. ఇప్పటివరకూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించాలంటే, సదరు రాష్ట్రాల అనుమతి తప్పనిసరికాగా, ఇకపై ఆ అవసరం లేదు. 
 
పలు రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఈ-పాస్‌లు లేకుండానే సరిహద్దులను దాటి వెళ్లవచ్చని, ఇకపై ఏ రాష్ట్రం కూడా ఈ-పాస్ విధానాన్ని అమలు చేయరాదని కేంద్రం స్పష్టంగా తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
తాజా ఉత్తర్వుల ప్రకారం అంతర్రాష్ట్ర ప్రయాణాలనుగానీ, ఓ రాష్ట్రంలోని రెండు జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలకుగానీ, ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కల్పించకూడదు. అదేసమయంలో సరకు రవాణానూ అడ్డుకోరాదు. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలోని నివాసితులకు మాత్రం నిబంధనలు అమలులో ఉంటాయి. 
 
వివిధ అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చే వారికి కూడా నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే వారికి, వారు వెళ్లే రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనలను పాటించాలని, క్వారంటైన్ నిబంధనలు వారికి తప్పనిసరని తెలిపింది.
 
అయితే, కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు, వ్యాపారాలకు, సరకు రవాణాకు ఇబ్బందులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.