శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By వెంకటేశ్వర రావు .ఐ
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (20:57 IST)

ఏపీ జనం దెబ్బకి కరోనావైరస్ పారిపోతుందా? రోజుకి 10,000 కేసులైనా లెక్కచేయని వైనం

కరోనావైరస్ టెస్టుల కోసం ఆసుపత్రుల ముందు బాధితులు క్యూ కడుతున్నారు. టెస్టులు చేయించుకుంటున్నారు కానీ జాగ్రత్తలు మాత్రం ఎంతమాత్రం తీసుకోవడంలేదు. మాస్కులు కట్టుకోరు, పక్కనే కరోనావైరస్ పాజిటివ్ వ్యక్తి వున్నా అతడితో కలిసిపోయి గంటలకొద్దీ మాట్లాడుతారు. కనీసం భౌతిక దూరం పాటించరు.
 
ఇక నిత్యావసర వస్తువులు, షాపులు ఇతరత్రా చోట్లకైతే వేరే చెప్పక్కర్లేదు. ఎవరో తరుముకు వస్తున్నట్లు తోసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇదీ ఏపీలో జనం పరిస్థితి. అంతెందుకు కరోనావైరస్ పాజిటివ్ అని అనుమానంతో వెళ్లి టెస్ట్ చేయించుకుని ఇంటికి వచ్చి కనీసం కాళ్లూచేతులు కూడా కడుక్కోనివారు ఎందరో. అవే దుస్తులతో నేరుగా వెళ్లి బెడ్రూంలో పడుకుంటారు. ఇలావుంటే రోజుకి పదివేలేం ఖర్మ... ఇంకా చెలరేగిపోయే ప్రమాదం లేకపోలేదు.
కరోనా అంటే.. ఏదో వారం పది రోజులు క్వారెంటైన్లో వుండటం, ప్రభుత్వం ఇచ్చే కరోనా కిట్ మాత్రలు వేసుకుని బయటపడటం.. అంతే అనుకుంటున్నారు. కొందరైతే... ఎన్నాళ్లిలా భయంతో చస్తూ బ్రతుకుతాం. అదేదో వచ్చేస్తే ఓ పనైపోతుంది. కరోనా వైరస్ కిట్ మాత్రలు వేసుకుని శరీరాన్ని వైరస్ పైన పోరాడగల సత్తా వచ్చేస్తుంది అనేవాళ్లు వున్నారు. ఐతే అది ప్రాణాంతకంగా మారితే ఎంత దారుణంగా వుంటుందో తెలియడంలేదు.
 
మరికొందరైతే... ఏంటండీ కరోనా గిరోనా, దాని ముఖం. అసలు దానికి భయపడకుండా బజార్లో తిరిగేవాడికి ఏమీ రావడంలేదు. ఇంట్లో దాక్కుని దాక్కుని జాగ్రత్తగా వుండేవాడినే పట్టుకుంటుంది అంటున్నారు. తెలిసిన మిత్రులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ ఇది. మరి ఏపీ జనం దెబ్బకు కరోనావైరస్ పారిపోతుందా?
మార్చి-ఏప్రిల్- మే నెలల్లో తొలుత దేశంలోనే అత్యల్ప స్థాయిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఏపీలో. ఎంతో జాగ్రత్తగా వున్న జనం ఒక్కసారిగా అన్నీ వదిలేశారు. మాస్కులు వేసుకున్నా, వాటిని గడ్డం కింద పెట్టుకుని వెళుతున్నారు. అంటే... అది ఓ అలంకారంలా మారింది తప్పితే జాగ్రత్త అని అనుకోవడంలేదు. దీనితో కరోనావైరస్ ఫలితాలు తలక్రిందులయ్యాయి.
ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులు 4,11,269. వీరిలో 3,09,792 మంది డిశ్చార్జ్ కాగా 3,796 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,681. అంటే సుమారు లక్ష వరకూ ఆస్పత్రులలో వున్నారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా వుండాలి. వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే తప్పించి ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కష్టం. కరోనావైరస్ గొలుసును తెంచకుండా పెనవేస్తూ పోతూవుంటే ఎవరైనా మాత్రం ఏం చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి నడుం బిగించాలి.