సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శనివారం, 29 ఆగస్టు 2020 (16:34 IST)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట కరోనావైరస్ కలకలం

తెలంగాణ ప్రజా ప్రతినిధులను కరోనా భయం వెంటాడుతున్నది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ మ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతుంది. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట కరోనా కలకలం రేపింది.
 
హైదరాబాదులో తన నివాసంలో తనతో పాటు ఉంటున్న గన్‌మెన్‌లకు డ్రైవర్‌తో పాటు కొందరు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో వారందరికీ చికిత్స చేయనున్నట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందన్నారు. అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.
 
డాక్టర్ల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లుగా తెలిపారు. పొంగులేటి ప్రతి కార్యకర్తకు, అభిమానులకు ఫోన్లో అందుబాటులో ఉంటున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతున్నాయి.
 
మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి. కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. ఇప్పటివరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 30,008 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.