ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఎమ్మెల్యే మృతి... ఎందుకో తెలుసా?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న వారు చనిపోతున్నారు. అలాగే, అనేక మంది ప్రజా ప్రతినిధులు మృతి చెందారు. తాజాగా మరో ఎమ్మెల్యే చనిపోయారు.
తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనాను కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. కరోనా సోకవడంతో ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి జీనా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఆయన భార్య ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు. అంతలోనే జీనా మృతి ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 8 డిసెంబరు 1969లో అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జీనా జన్మించారు.
2007లో తొలిసారి బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతిపట్ల బీజేపీతో పాటు ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.