సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (14:51 IST)

బెంగాల్‌పై బీజేపీ దండయాత్ర ... రాణి 'రుద్రమదేవి'లా మమతా బెనర్జీ

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి దృష్టి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంపైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ కోటపై కాషాయం జెండా ఎగురవేయాలని కమలనాథులు ఎన్నో రకాలైన వ్యూహాలు పన్నారు. అస్త్రశస్త్రాలను ప్రయోగించారు. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తనవైపునకు లాగేశారు. ఇలా అన్ని వైపుల నుంచీ బీజేపీ అధిష్టానం మమతా బెనర్జీని చుట్టుముట్టేసింది. 
 
ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బెంగాల్‌ ‘దండయాత్ర’ను చేసింది. అయినా సరే సీఎం మమతా బెనర్జీ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. ఎన్నికల ఫలితాల్లో 210 సీట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక ప్రత్యర్థి బీజేపీ 78 సీట్లకే పరిమితమైంది. తృణమూల్ నుంచి సీఎం మమతా బెనర్జీ ఒక్కరే రాజకీయ యవనికపై కనిపిస్తూ ప్రచారం చేశారు. 
 
కానీ, ఆమె వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నప్పటికీ తెర ముందు మాత్రం మమతా బెనర్జీయే. అదే బీజేపీ శిబిరంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 
 
అంతేకాకుండా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వారం రోజుల పాటు వారందరూ వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి షా.. ఇలా... అగ్రనేతలందరూ లెక్కకు మించి పర్యటనలు చేశారు. 
 
ఇవన్నీ ఒకెత్తు... ఎనిమిది దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తన షెడ్యూల్‌‌లో ప్రకటించింది. ఇలా ఎనిమిది దశల్లో ఎన్నికలను నిర్వహించడమేంటని షెడ్యూల్ ప్రకటించగానే సీఎం మమత ఈసీని నిలదీశారు. అలాగే, కేంద్ర భద్రతా బలగాలపై కూడా ఆమె విమర్శలు చేశారు. 
 
ఎనిమిది దశల్లో ఎన్నికలు, కేంద్ర భద్రతా బలగాల వల్ల తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని తృణమూల్ శిబిరం భావించింది. ఈ రెండింటి వల్లా తృణమూల్ ఎంత భయపడ్డా... అంత సునాయాసంగా విజయ తీరాలవైపు దూసుకెళ్తోంది. సరిగ్గా ఎన్నికల సమయం నాటికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. 
 
అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వీల్‌చైర్‌లో ప్రచారం నిర్వహించారు. అధినేత్రి గాయాల పాలుకావడంతో పార్టీకి ఘోర పరాభవం తప్పదని కేడర్ తీవ్రంగా భయపడింది. అయినా.. అధినేత్రి మాటలు, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో పార్టీ భారీ విజయం వైపు పయనిస్తోంది.