మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (09:16 IST)

తెలుగు వారికి గుడ్ న్యూస్ చెప్పిన మమత బెనర్జీ..!

తెలుగు వారికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తెలుగుకు అధికార భాషా హోదా ఇస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్‌లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'మినీ ఆంధ్రా'గా పేరున్న ఖరగ్‌పూర్‌లోని తెలుగు ప్రజలను ఆకర్షించి ఓట్లు రాబట్టుకునేందుకు మమత సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగు వారు కౌన్సిలర్లుగా పని చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీల్లోనూ ముఖ్య స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని వారంతా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఈ మేరకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.