శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (12:07 IST)

వరద నీటిలో చిక్కుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి... రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించడంతో అనేక గృహాలు నీట మునిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఇంట్లోకి కూడా నీరు వచ్చి చేరింది. దీంతో ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. బీహార్ రాష్ట్రంలో రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
యూపీలో 111 మంది, బీహారులో 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క బీహారులోనే 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో... జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. 
 
ఇదిలావుంటే, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 145 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు పార్టీ కార్యకర్తలు సహాయం చేయాలని బీహార్ కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.