సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (09:08 IST)

సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరికలు : పరుగులు పెట్టిన కేంద్రం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దెబ్బకు కేంద్రం పరుగులు పెట్టింది. ఆగమేఘాలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో 8 మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల నియామకం చేపట్టింది. 
 
ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ)లో ఆరుగురు జ్యుడీషియల్, ఏడుగురు అకౌంటెంట్ సభ్యులను నియమించింది. అలాగే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీషియల్ సభ్యులను నియమించింది. మొత్తంగా చూస్తే ఈ మూడు ట్రైబ్యునల్స్‌కు కలిపి 37 ఖాళీలను ఆగమేఘాల మీద భర్తీచేసింది.
 
కాగా, ట్రైబ్యునల్స్ ఖాళీల భర్తీపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఈ నెల 6న కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. 
 
ఉద్దేశ పూర్వకంగా కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారని, సోమవారం లోపు ఖాళీలను భర్తీ చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆగమేఘాల మీద నియామకాలు చేపట్టి కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకుంది.