శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (21:06 IST)

వైకుంఠ ఏకాదశి వ్రతం.. అవిసె ఆకులు.. ఉసిరికాయ తప్పకుండా వుండాలట..!

వైకుంఠ ఏకాదశి వ్రతం సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే పండుగల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక విశిష్టత వుంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజునే ముక్తి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ ఏకాదశి ఒక్కరోజున వ్రతమాచరిస్తే సంవత్సరమంతా ఏకాదశి వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది. ఈ నెల డిసెంబర్ 25న శుక్రవారం వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. 
 
వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ఎలా?
వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు.. ఏకాదశికి ముందు రోజైన దశమి తిథిన ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అలా ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. వ్రతం ప్రారంభించాలి. ఏకాదశి రోజున భోజనం తీసుకోకూడదు. నీటిని సేవించవచ్చు. ఏకాదశి రోజున తులసీ దళాలను కోయటం చేయకూడదు. పూజ కోసం కావాలంటే ముందు రోజే కోసుకుని సిద్ధం చేసుకోవాలి. వ్రతమాచరించే వారు 7సార్లు తులసీ దళాలను నమలవచ్చు. తులసీ దళాలు శరీరానికి కావలసిన వేడిమినిస్తాయి. ఏకాదశి వ్రతమాచరించడం శీతాకాలంలో కావడంతో తులసీ దళాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడిని పొందడం చేయొచ్చు. 
amla
 
ఏకాదశి రోజున పూర్తిగా భోజనం తీసుకోకుండా వుండలేని వారు.. నెయ్యి, కాయగూరలు, పండ్లు, శెనగలు, పాలు, పెరుగు వంటి స్వామికి నైవేద్యం సమర్పించి తీసుకోవచ్చు. ఇంకా ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం, విష్ణు పాటలతో స్తుతించాలి. 
 
మరుసటి రోజు ద్వాదశి రోజున ఉదయం 21 రకాల కూరగాయలతో కూర వండి.. స్వామికి సమర్పించాలి. ఆపై ఏకాదశి వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే భోజనం తీసుకోవాలి. విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యంలో అవిసె ఆకు, ఉసిరికాయ తప్పక వుండాలి. ద్వాదశి రోజున పగటి పూట నిద్ర పోకూడదు. ఏకాదశి వ్రతం దశమి రోజున ప్రారంభమై.. ఏకాదశి, ద్వాదశి రోజున మూడు తిథులను కలుపుతూ ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి పాపాలు తొలగిపోతాయి. వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇంకా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.