బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 24 జూన్ 2019 (20:51 IST)

ఆ 8 మంది కోసమా... లేక ఈ ఒక్కరి కోసమా...

ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడు గొప్ప జ్ఞాని. వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకునేవాడు. అతడ వివాహితుడు. చాలాకాలం తర్వాత అతడికి ఒక కుమారుడు జన్మించాడు. వాడికి హారు అని పేరు పెట్టాడు. కుమారుడి పట్ల తల్లిదండ్రులకిద్దరికీ ఎంతో అనురాగం ఉండేది. అది సహజమే, ఎందుకంటే ఆ కుమారుడు కుటుంబానికి రత్నం లాంటివాడు. రైతు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలవాడైనందున గ్రామస్తులందరూ అతన్ని ఇష్టపడేవారు. 
 
ఒక రోజు అతడు తన పొలంలో పని చేసుకుంటున్నాడు. అప్పడు ఎవరో వచ్చి హారుకు కలరా సోకిందని చెప్పారు. రైతు ఇంటికి వెళ్లి హారుకు చికిత్స చేయించాడు. కాని వాడు మరణించాడు. దానితో ఇంట్లోని వారందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాని రైతు మాత్రం ఏమి జరుగనట్లే ప్రవర్తించాడు. పైగా దుఃఖించి ఏమిటి ప్రయోజనం అంటూ అందరికి ఓదార్పు చెప్పసాగాడు. తరువాత సేద్యం చేసుకోవడానికి వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే భార్య ఇంకా ఏడుస్తూనే ఉంది. 
 
ఆమె ఇలా అంది... నువ్వెంత కఠినాత్ముడవు. కుమారుడి కోసం ఒక్కచుక్క కన్నీరైనా కార్చలేదు. అందుకు ఆ రైతు ప్రశాంత చిత్తముతో ఇలా సమాధానమిచ్చాడు. నేనెందుకు ఏడవలేదో చెప్పమంటావా.. నిన్న నేను ఒక కల గన్నాను. అందులో నేను రాజునయ్యాను, ఎనిమిది మంది కుమారులకు తండ్రినయ్యాను. వారితో ఎంతో ఆనందంగా ఉన్నాను. అంతలో మెలకువ వచ్చింది. ఇప్పుడు నేనో సందిగ్ధంలో పడ్డాను. ప్రస్తుతం నేను ఆ ఎనిమిది మంది కుమారుల కోసం దుఃఖించాలా లేక ఈ ఒక్క హారు కోసమా... ఆ రైతు జ్ఞాని. అందుకే స్వప్నావస్థ ఏ విధంగా మిధ్యో జాగ్రదావస్థ కూడా అలాగే మిధ్య అని గ్రహించాడు. నిత్య వస్తువు ఒక్కటే. అది ఆత్మ.