సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 15 జూన్ 2019 (22:57 IST)

బుద్ధి ఎలా వికసిస్తుంది అంటే.....

సాధారణంగా అన్ని ప్రాణులలో బుద్ది అనే విశిష్టమైన యోగ్యత ఉండదు. లేదా చాలా తక్కువ మోతాదులో వికసించి ఉంటుంది. పావురాలు ధాన్యపు గింజలను చూసి వలలో చిక్కుకుంటాయి. వల మీద వాలడం తమకు ప్రాణపాయమనే విషయం కనీసం ఆలోచించను కూడా ఆలోచించవు. పచ్చ పచ్చగా ఉన్న పొలాలను చూసి పశువులు మేయడానికి వెళ్తాయి. కానీ దాని వలన ఎటువంటి ఆపద వస్తుందో అవి ఆలోచించలేవు. 
 
కానీ మనిషి ఇతరులు ఇచ్చిన రొట్టెను తినే ముందు ఆలోచించి అది అనుచితమని తోస్తే ఆకలితో మాడుతున్నా కూడా ఆ పని చేయడు. తాత్కాలిక లాభం కోసం ఎటువంటి ఒడంబడికతో జారిపోకుండా, తమ కార్యాలతో ఇతరుల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, భవిష్య పరిణామం ఎలా ఉంటుంది. ఈ విషయాలన్ని ఆలోచించి విచారించి తెలుసుకోగలిగి, అనుభవం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే యోగ్యతనే బుద్ధి అని చెప్పవచ్చు.
 
జిజ్ఞాస-జ్ఞానాన్ని పొందాలనే కోరిక, జ్ఞానార్జనకు ఇది ప్రధమ మెట్టు అని చెప్పవచ్చు.ఎవరి మనసులో నేర్చుకోవాలనే అభిలాష ఉంటుందో, వారి మస్తిష్కం ఒక రకమైన అయస్కాంత గుణాన్ని పొందుతుంది. దాని ద్వారా వాంఛించిన విషయాన్ని దానంతట అదే లాగుతూ ఉంటుంది. వైద్యునికి రోగులు ప్రతిచోటా కనబడతారు. కష్టపడే వారికి స్వర్గంలో కూడా కష్టాలే లభిస్తాయి. 
 
ఈ వాక్యాలలోని ఒక నిజం ఏమిటంటే వారి మస్తిష్క ఆకర్షణ శక్తి తనకు అనుకూలమైన పరిస్థితులను ఆకర్షిస్తుంది. నిఖిల విశ్వబ్రహ్మాండంలో అనంత జ్ఞానం నిండి ఉంది. అందులో నుండి ప్రతి వ్యక్తి ఎంత జిజ్ఞాస ఉంటే అంతే పొందుతాడు. నదిలో అఖిలజల ప్రవాహం ఉంటుంది. కానీ ఎవరైనా సరే తనవద్ద ఎంత పెద్ద పాత్ర ఉంటే అంతే తీసుకోగలడు. నేర్చుకోవాలనే ఇష్టంలేనివారు ఎప్పటికీ నేర్చుకోలేరు. కాబట్టి జ్ఞానాన్ని పొందాలని అనుకునేవారు తమలోపల ప్రబలమైన జిజ్ఞాసను ఉత్పన్నం చేసుకోవాలి. నేర్చుకోవాలనే కోరికతో మానసిక స్ధితిని పరిపూర్ణం చేసుకోవాలి.