తిరుమల శ్రీవారి మెట్ల మార్గం మూసివేత.. ఎందుకో తెలుసా?
తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అలిపిరి నడకమార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది.
తితిదే తీసుకున్న నిర్ణయంతో జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గాన్ని మూసేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. నడకమార్గం పైకప్పు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది.
అయితే అలిపిరి నడకమార్గానికి ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ఎంతోమంది భక్తులు నడకమార్గం ద్వారా వెళ్లేందుకు ఇష్టపడతారు.
వేలాది మంది భక్తులు నడకమార్గం ద్వారానే వస్తామని స్వామికి మొక్కుకుంటారు. ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం మూతపడటంతో... అలాంటి భక్తులందరూ శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.