శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (22:23 IST)

శ్రీవారి దర్సనాలను ఇప్పుడే పెంచే ఆలోచనలో లేదు: టిటిడి ఈవో

ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు లేవు. ఆన్ లైన్ ద్వారానే టిక్కెట్లు పొందాల్సిన పరిస్థితి భక్తులది. టోకెన్లు లేకుండా తిరుమలకు అనుమతించే పరిస్థితే లేదు. దీంతో చాలామంది భక్తులు శ్రీవారిని దర్సించుకోకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంతో వ్యయప్రయాసాలతో కరోనా సమయంలో స్వామవారిని దర్సించుకుని మ్రొక్కులు తీర్చుకుందామనుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. 
 
అయితే ఇలాంటి సమయంలో టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ ఇప్పట్లో దర్సనాలను పెంచే ఆలోచనలో లేదని టిటిడి ఈఓ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తిగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాకే నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. 
 
తిరుమలలోని పలు ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేసిన టిటిడి ఈఓ మీడియాతో మాట్లాడారు. లడ్డూ, కౌంటర్లు, లడ్డూ పోటు, ఆలయ మాఢా వీధులు, గోశాలను టిటిడిఅధికారులతో కలిసి తనిఖీ చేశారు. పచ్చదనం ఉట్టిపడేలా తిరుమలలో మరిన్ని ఉద్యానవనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 
 
శ్రీవారికి వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని..పలువురు దాతలు ఈ కార్యక్రమ నిర్వహణకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. శ్రీవారి నైవేధ్యం, దీపారాధనకు గోఆధారిత నెయ్యిని తిరుమలలోనే సమకూర్చుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
 
ఆగష్టు 15వ తేదీ నుంచి పుష్పాలతో అగరబత్తులు తయారీని ప్రారంభిస్తామన్నారు. అగరబత్తులు విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణ ట్రస్ట్‌కు మళ్ళిస్తామన్నారు. అదనపు బూందీ పోటు భవనంను త్వరలోనే సిఎం ప్రారంభిస్తారని చెప్పారు ఈఓ. అలాగే వంశపారపర్య అర్చక బలోపేతానికి ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు.