తిరుమల ఆకాశగంగ వద్ద తొలిసారిగా హనుమజ్జయంతి వేడుకలు: టిటిడి ఈఓ
హనుమంతుడు ఎక్కడ పుట్టారన్న విషయంపై ఇప్పటికే టిటిడితో పాటు గోవిందానంద సరస్వతిలకు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టిటిడి మాత్రం తిరుమలలోనే ఆంజనేయుడు పుట్టాడంటూ ఏకాంగా తొలి హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించేసింది.
ఈ వేడుకలను టిటిడి ఈఓ జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయస్వామి వారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లెపూలతో అర్చన నిర్వహించారు.
అదేవిధంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన నివేదనలు నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో భక్తులు పెద్దగా వేడుకలకు హాజరుకాలేదు. పరిమిత సంఖ్యలో భక్తులు వేడుకలకు హాజరయ్యారు.