శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (09:06 IST)

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

ttd ankurarpana
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుండి 12వ తేదీ వరకూ జరగనున్న దృష్ట్యా ధ్వజారోహణానికి ముందు రోజు అంటే గురువారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకరార్పణం లేదా బీజవాసనం అత్యంత ముఖ్యమైనది. 
 
ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాపతి అయిన శ్రీవిశ్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. 
 
అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలు నాటుతారు. నవ ధాన్యాలకు మొలక లొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. అంకురార్పణం ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.
 
కాగా, తిరుమలలో పవిత్ర విష్ణుదర్భతో తయారు చేసిన చాప, తాడు ఊరేగింపు ఘనంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే చాప, తాడుకు పూజలు చేసి.. ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. బ్రహ్మోత్సవాల అరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి.. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభానికి చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పైవరకు చుడతారు.