సోమవారం, 28 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 అక్టోబరు 2024 (23:27 IST)

తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం: మోహిత్ పోరాడినా పుణెరి పల్టాన్‌కు తప్పని ఓటమి

pro kabaddi
ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండు విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు చెక్ పెట్టింది. బుధవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 35-30 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున రైడర్లు నరేందర్ కండోలా 9, సచిన్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్ నితేశ్ కుమార్ (5) హైఫైవ్ సాధించాడు. పుణెరి జట్టులో రైడర్ మోహిత్ గోయత్ (13) ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ను తలైవాస్ రెండుసార్లు ఆలౌట్ చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ ఆరంభం నుంచి జోరు చూపెట్టింది. నరేందర్ వరుసగా రెండు టచ్ పాయింట్లు రాబట్టగా, పంకజ్‌, అస్లాంను తలైవాస్ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో ఆ జట్టు 4-0 ఆధిక్యంతో ఆటను ఆరంభించింది. అయితే, సచిన్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేసిన పుణెరి పల్టాన్ 5-6తో ముందుకొచ్చింది. మోహిత్ వరుసగా రెండు డబుల్ పాయింట్ల రైడ్లతో ఆకట్టుకోగా.. అస్లాం కూడా డబుల్ పాయింట్ రైడ్ చేయడంతో పుణెరి 10-11తో నిలిచింది. కానీ, కోర్టులో మిగిలిన అస్లాంను ట్యాకిల్ చేసిన తలైవాస్ 8వ నిమిషంలో  పుణెరి ఆలౌట్ చేసి 14-11తో ముందంజ వేసింది. ఇక్కడి నుంచి పుణెరి డిఫెన్స్‌లో మెరుగైనా తమిళ జట్టు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. డూ ఆర్ డై రైడ్ కి వచ్చిన మోహిత్‌ను ట్యాకిల్ చేసి 19-15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. 
 
ద్వితియార్థం మొదలైన వెంటనే సచిన్‌ ఓ టచ్ పాయింట్ తీసుకురాగా, ఆకాశ్‌ను నితేశ్‌ ట్యాకిల్‌ చేశాడు. డుబ్కితో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసిన అస్లాంను తలైవాస్ డిఫెండర్లంతా నిలువరించారు. దాంతో తలైవాస్ 22-15తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఈ దశలో పుణెరి డిఫెండర్లు సత్తా చాటారు.  నరేందర్‌‌ను సూపర్ ట్యాకిల్‌ చేసిన పుణెరి మరోసారి అతడిని నిలువరించింది. సాహిల్‌ ప్రత్యర్థికి దొరికిపోయినా సచిన్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేసిన  పల్టాన్‌ డిఫెండర్లు  21-24తో అంతరాన్ని తగ్గించారు. కానీ, తలైవాస్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నరేందర్‌‌ మళ్లీ రైడింగ్‌లో జోరు పెంచగా.. డిఫెండర్లు కూడా విజృంభించారు. ఈ క్రమంలో పుణెరిని రెండోసారి ఆలౌట్‌ చేసిన తలైవాస్ 30-22తో తన ఆధిక్యాన్ని భారీగా పెంచుకుంది. చివరి నిమిషాల్లో పుణెరి డిఫెండర్లు సూపర్ ట్యాకిల్స్‌ తో ఆకట్టుకోవడంతో ఓటమి అంతరం తగ్గింది.