శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (16:35 IST)

ముగిసిన సానియా మీర్జా శకం.. హైదరాబాద్ వేదికగా చివరి మ్యాచ్

sania farewll match
భారత టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా శకం ముగిసింది. ఆమె తన సొంత అభిమానుల మధ్య ఆదివారం చివరి మ్యాచ్ ఆడింది. ఈ ఫేర్‌వెల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ స్టేడియంలో జరిగింది. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు సందడిగా కనిపించాయి. సానియా ఆడుతున్న చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు అలా అనేక మంది తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్‌ తదితరులు ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా మీర్జా కంటతడి పెట్టారు. 
 
కాగా, ఈ ఫేర్‌‌మ్యాచ్‌లో సానియా మీర్జా, బోపన్నా, ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్‌ జోడీలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సానియా మీర్జా తన ట్రేడ్ మార్క్‌‍ షాట్లతో ఆలరించారు. స్థానిక అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య సానియా మీర్జా తన చివరి మ్యాచ్ ఆడి, వీడ్కోలు పలికింది. మ్యాచ్ ముగియగానే ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 
 
ఈ మ్యాచ్ అనంతరం సానియా మీర్జా విలేకరులతో మాట్లాడుతూ, సొంతగడ్డపై తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ మధ్య చివరి మ్యాచ్‌తో టెన్నిస్ కెరీర్‌తో వీడ్కోలు పలకడం ఎంతో సంతోషానికి గురిచేసింది. బ్యాడ్మింటన్ తరహాలో టెన్నిస్‌లోనూ సమర్థమైన వ్యవస్థ నిర్మితంకావాలి. ఇకపై భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దడం కోసం తన సమయాన్ని వెచ్చిస్తాను. సినిమాలపై ఆసక్తి లేదు. అందుకే బాలీవుడ్‌లో ఆఫర్ వచ్చినా తిరస్కరించాను. వింబుల్డన్ జూనియర్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడకు వచ్చినపుడు లభించిన అపూర్వ స్వాగతం తన జీవితంలో మరువలేనిది అని సానియా మీర్జా గుర్తుచేశారు.