గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జులై 2021 (15:09 IST)

టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం... ఇద్దరికి పాజిటివ్

జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఈ నెల 23వ తేదీ నుంచి ఒలింపిక్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ సమయం సమీపిస్తున్న తరుణంలో కరోనా కలకలం సృష్టించింది. ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. 
 
క్రీడాకారులు బస చేసే ఒలింపిక్ గ్రామంలో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజుల కిందటే ఓ అథ్లెట్ కరోనా బారినపడడం తెలిసిందే. దాంతో ఒలింపిక్ విలేజ్‌లో కరోనాతో బాధపడుతున్న అథ్లెట్ల సంఖ్య మూడుకు చేరింది. ఈ ముగ్గురు ఒకే దేశానికి చెందిన వారని, అది కూడా వీరంతా ఒకే క్రీడాంశంలో పాల్గొనే అథ్లెట్లు అని టోక్యో ఒలింపిక్స్ అధికార ప్రతినిధి మాసా టకాయా తెలిపారు. 
 
ప్రపంచ దేశాల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ షిప్ వంటి గృహసముదాయంలో బస ఏర్పాటు చేశారు. ఇందులో భారీ అపార్ట్ మెంట్ తరహా భవనాలు ఉంటాయి. వీటిలో 6,700 మంది అథ్లెట్లు బస చేస్తారని అంచనా. 
 
ఇన్ని వేలమంది ఉండే ఈ ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం రేగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరో ఐదు రోజుల్లో ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఒలింపిక్ గ్రామంలో ఇంకెన్ని పాజిటివ్ కేసులు బయటపడతాయోనని భయపడుతున్నారు.