శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (17:07 IST)

తెలంగాణ ఎన్నికలు : తెరాసకు షాక్.. వరుసబెట్టి రాజీనామాలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు తేరుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. బోయిన్‌పల్లి తెరాస నేతల్లో రాజుకున్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఫలితంగా ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుతాడి రవి కుమార్, డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు కాదీర్, అంజయ్యగౌడ్, పల్ల కుమార్, పోచయ్యల ఆధ్వర్యంలో మూకుమ్మడి రాజీనామా చేశారు. 
 
కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా ఉద్యమకారులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు చించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన తమకు సముచిత స్థానం ఇవ్వలేదని వారు మండిపడ్డారు. కృష్ణారావు పార్టీలో చేరినప్పటి నుంచి అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సహనం నశించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో తెలుపుతామన్నారు. 
 
అలాగే, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివాస్ రెడ్డిని తెరాస పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. రాజేంద్రనగర్‌ నుంచి శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. అయితే, టీడీపీ నుంచి పార్టీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కే తెరాస టిక్కెట్ ఇచ్చింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఫలితంగా పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ శనివారం ప్రకటించింది.