శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (10:37 IST)

తెలంగాణలో 18 జిల్లాలు ఔట్? 17 లోక్‌సభ స్థానాల పరిధిలో కొత్త జిల్లాల ఏర్పాటు!

revanthreddy
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల సంఖ్యను 17కు తగ్గించనుంది. దీంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో 18 జిల్లాలు మాయం కానున్నాయి. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ వార్తను ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశం ఉంది. 
 
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రద్దు కాబోయే జిల్లాలను పరిశీలిస్తే, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలు ఉన్నాయి. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బుధవారం ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్‌సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. 
 
సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం. కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు: రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే అవకాశం ఉంది. జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తంగా కానుంది. 
 
విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్‌లన్నీ తిరగరాయాల్సి వుంటుంది. పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు. ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగంకానున్నాయి. పార్లమెంటు ఎన్నికల ముంగిట రేవంత్ సర్కార్ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.