పిచ్చికుక్కల స్వైరవిహారం, 10 మందికి తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ పిచ్చి కుక్కల దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి కనుగుడ్డు తొలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ తండాలో పిచ్చికుక్కల స్వైర విహారంతో జనం భయకంపితులయ్యారు.
దొరికిన వారిని దొరికినట్లు దాడి చేశాయి. కండలను కొరికాయి. వీరస్వామి అనే వ్యక్తి కనుగుడ్డు పీకటంతో యంజియంకు తరలించారు. మిగతావారికి తీవ్రగాయాలయ్యాయి. పిచ్చి కుక్కల స్వైరవిహారంతో స్థానికులు హడలిపోయారు. స్థానికులు వెంబడించి జనంపై దాడి చేసిన కుక్కను చంపేసారు.
కుక్కల సమస్య తీవ్రంగా ఉన్నదని, సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా స్పందించలేదని సర్పంచ్ రామస్వామి తెలిపారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుక్కల బీభత్సానికి జనం భీతిల్లిపోయారు. అధికారులు స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సర్పంచ్ రామస్వామి కోరుతున్నారు.