18న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు...
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 18వ తేదీ విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకు కొనసాగిన సంగతి తెలిసిందే.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ యేడు విద్యా సంవత్సరం వెనుకబడి పోయింది. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల కసరత్తుతో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తైనట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. ఫలితంగా 18న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫలితాలను ప్రెస్‌మీట్ పెట్టి విడుదల చేయకుండా.. ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని చెప్పారు.