యువతిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?
సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కనే ఉండే ఆ యువతి ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో వెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
మానసిక క్షోభకు గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. స్నేహితురాలి ద్వారా అత్యాచార విషయం బాధితురాలి సోదరికి తెలిసింది. ఎట్టకేలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యాచార ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.5లో ఉన్న దేవరకొండ బస్తీలో ఓ యువతి నివసిస్తోంది. ఇదే బస్తీలో ఆమె ఇంటికి సమీపంలో చిన్మయి సైక్యా (22) అనే యువకుడు నివసిస్తున్నాడు.
హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో అతను సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం యువతికి, చిన్మయి సైక్యాకి పరిచయం ఏర్పడింది. ఒకే బస్తీలో ఉంటుండటంతో యువతి అప్పుడప్పుడు అతనితో మాట్లాడేది.
ఈ క్రమంలో యువతిపై కన్నేసిన సైక్యా ఈ నెల 4న ఆమె ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం, ఈ విషయం బయటకు పొక్కవద్దని.. ఒకవేళ ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
బాధితురాలు మొదట ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పింది. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ వారికి ఫోన్ ద్వారా మెసేజ్ చేసింది. దీంతో బాధితురాలి స్నేహితురాళ్లు ఆమె సోదరి, బావలకు సమాచారమిచ్చారు.
సోదరి, బావ సహాయంతో బాధిత యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సైక్యాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.