బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (09:55 IST)

తెలంగాణాలో సాధారణ వైద్య సేవలు... ఖాళీ అవుతున్న కోవిడ్ పడకలు

తెలంగాణా రాష్ట్రంలో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దీంతో కొవిడ్ ఆసుపత్రులలోని ఖాళీ పడకల సంఖ్య పెరుగుతోంది. 
 
ఆసుపత్రికి వచ్చే కరోనా రోగుల సంఖ్య పడిపోవడంతో ఆయా ఆసుపత్రుల్లో వారి కోసం కేటాయించిన పడకలను తిరిగి సాధారణ పడకలుగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 91 శాతం కొవిడ్ పడకలు ఖాళీ అయ్యాయి.
 
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 55,442 కొవిడ్ పడకలు ఉండగా నిన్నటికి 4,931 (8.89) శాతం పడకలు మాత్రమే నిండాయి. మిగిలిన 50,511 (91.11 శాతం) పడకలు ఖాళీగా వున్నాయి. 
 
అలాగే, ఐసీయూ, వెంటిలేటర్ పడకలు కూడా ఖాళీ అవుతున్నాయి. 21,846 సాధారణ పడకల్లో 871.. 21,751 ఆక్సిజన్ పడకల్లో 2,266.. 11,845 ఐసీయూ పడకల్లో 1,794 బెడ్‌లలో రోగులు చికిత్స పొందుతున్నారు.
 
ఇక, 250 పడకలు ఉన్న చిన్న ఆసుపత్రులు కొవిడ్ కోసం కేటాయించిన బెడ్‌లను సాధారణ పడకలుగా మార్చేశాయి. బెడ్లు ఖాళీగా మారుతుండడంతో సాధారణ వైద్య సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.