గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:56 IST)

రాజు ఆత్మహత్యపై అనుమానాలెందుకు? డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశ్న

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్యపై అనేక మంది అనేక రకాలైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దని, ఆత్మహత్య చేసుకుంటుండగా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారన్నారు. ఇందులో కోణార్క్‌ ట్రైన్‌కు సంబంధించిన లోకో పైలట్లు, ముగ్గురు రైతులు, ఇద్దరు రైల్వే గ్యాంగ్‌మన్లు సాక్షులన్నారు. 
 
అతను ఆత్మహత్యకు ముందు ట్రాక్‌పై తిరగడం గాంగ్‌మెన్‌ చూశాడని వివరించారు. వెంటనే అతన్ని ప్రశ్నించగా.. పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయాడని.. మళ్లీ కాసేపటికి తిరిగివచ్చిన గాంగ్‌మెన్‌కు పట్టాలపై రాజు శవం కనిపించిందన్నారు. రాజు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కింద పడడం అక్కడే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా చూశారన్నారు. 
 
సాక్షుల వీడియో స్టేట్‌మెంట్‌ వీడియో రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యపై ఘన్‌పూర్‌తో పాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు లోకో పైలట్లు ఘటనను ఇద్దరు అధికారికంగా రికార్డు చేశారని తెలిపారు. నిందితుడు రాజు ఆత్మహత్యపై అనవసర రాద్ధాంతాలు వద్దని.. ఎవరి వద్దనైనా ఆధారాలుంటే మాట్లాడాలని సూచించారు. తప్పుదోవ పట్టించే విధంగా ఎవరూ ప్రయత్నించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.