ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (15:58 IST)

దీపావళి బొనాంజ.. వేతనాలు పెంపు.. ఆస్తి పన్నుపై రాయితీ.. కేటీఆర్

జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. దీపావళి పర్వదినాన పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు ప్రకటించింది.

దసరా, దీపావళి వేళ కార్మికుల సంతోషం కోసం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కోవిడ్ 19పై పోరులో ముందుండి పోరాడిన యోధులకు ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. 
 
2020లో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని.. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.  పారిశుద్ద్య కార్మికులతో పాటు గృహ యజమానులకు కూడా మంత్రి కేటీఆర్ దీపావళి కానుక ప్రకటించారు.

రాష్ట్ర ప్రజలకు పండుగ కానుకగా ఆస్తి పన్నులో మినహాయింపును ప్రకటించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో.. ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
 
దీపావళి కానుకగా... జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 సంవత్సరానికి రూ.15వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

అలాగే రాష్ట్రంలోని మిగతా అన్ని పట్టణాల్లో రూ.10వేల వరకు ఆస్తి పన్ను చెల్లించేవారికి 50శాతం రాయితీ ఉంటుందన్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలకు, మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షల కుటుంబాలకు, తెలంగాణవ్యాప్తంగా మొత్తం 31.40 లక్షల కుటుంబాలకు రూ.326.48కోట్లు మేర లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు.