శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (08:57 IST)

తెలంగాణాలో దంచికొడుతున్న వర్షాలు... 23 వరకు భారీ వర్షాలే

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. 
 
ఆదిలాబాద్‌తో పాటు కుమురంభీం, నిర్మల్‌, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల ములుగు, జయశంకర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది.రాష్ట్రంలో ఈ నెల 22, 23వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 
 
వీటి ప్రభావం మరీ ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలపై పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో భాగ్యనగరి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే.