శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (11:10 IST)

కరోనాకు శాంపిళ్లు ఇచ్చి ఇంటికొచ్చి ఉరేసుకున్న స్వర్ణకారుడు... ఎక్కడ?

కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో శాంపిళ్లు ఇచ్చిన ఓ స్వర్ణకారుడు... కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో ఇంటికొచ్చి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కేవీఆర్ గార్డెన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పాతబస్తీ కేవీఆర్ గార్డెన్‌కు చెందిన ఓ స్వర్ణకారుడు (46) భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా మార్చి నెల నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయన రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గు, జలుబు చేయడంతో అనారోగ్యానికి గురయ్యాడు. 
 
దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన అతడు.. కరోనా భయంతో బుధవారం ఓ ప్రైవేటు ల్యాబులో పరీక్ష కోసం నమూనాలు ఇచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ల్యాబు వద్దే ఉండగా, స్నానం చేసి వస్తానంటూ ఇంటికెళ్లిన బాధితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పైగా, అతడికి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగటివ్ అని తేలింది. అయితే, తనకు కరోనా సోకిందన్న భయంతోనే అతడు తొందరపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. దీంతో దీన్ని ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.