శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (19:37 IST)

సామాజిక సంక్రమణ లేదు... రికవరీ రేట్ 62 శాతం : కేంద్రం క్లారిటీ

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అయితే.. ఈ ప్రచారంపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 
 
భారత్‌లో ఇప్పటికైతే కరోనా సామాజిక వ్యాప్తి దశలో లేదని స్పష్టం చేసింది. సామాజిక వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటివరకూ సరైన నిర్వచనం ఇవ్వలేదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఓఎస్‌డీ రాజేష్ భూషణ్ తెలిపారు.
 
అంతేకాకుండా, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చేయిదాటిపోలేదన్నారు. అదేసమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ర్యాపిడ్ టెస్టులను నిర్వహించి, కరోనా రోగులను గుర్తిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 
 
అంతేకాకుండా, దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 62 శాతంగా ఉందని, మరణాల శాతం కూడా ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని గుర్తుచేశారు. అలాగే, ప్రతి రోజూ 2.60 లక్షల మందికి కరోనా టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్‌కేర్ కరోనా వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేస్తున్నాయని ఆయన చెప్పారు. డీసీజీఐ ఆమోదం అనంతరం రెండు వ్యాక్సిన్లకు సంబంధించి యానిమల్ టాక్సిసిటీ స్టడీస్‌ పూర్తయినట్లు వెల్లడించారు. 
 
ఈ రెండు వ్యాక్సిన్లను ఫేజ్ 1, ఫేజ్ 2 దశల్లో క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించినట్లు ఆర్ భూషణ్ తెలిపారు. త్వరలో ట్రయల్స్ మొదలవుతాయని ఆయన స్పష్టం చేశారు.